Image
Name
Barre Kondababu
Posted
2020-03-18 09:55:00

Share:

బహుజన సమాజ్‌ పార్టీ(బిఎస్‌పి) బలపర్చిన జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బిఎస్‌పి నాయకుడు బర్రే కొండబాబు పిలుపునిచ్చారు. గోకవరం బస్టాండు వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌ నుంచి ఆజాద్‌ చౌక్‌ వరకూ వందలాది మంది దళిత, బహుజనులు బిఎస్‌పి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిఎస్‌పి నాయకుడు బర్రే కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బర్రే కొండబాబు అధ్యక్షతన జరిగిన సభలో కొండబాబు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఆకుల సత్యనారాయణను గెలిపిస్తే దేశంలో బహుజన సమాజ్‌ పార్టీ అధినేత మాయావతికి వేసినట్లేనని, అసెంబ్లీ అభ్యర్థి అనుశ్రీ సత్యనారాయణకు ఓటు వేస్తే పవన్‌ కళ్యాణ్‌కు వేసినట్లు అని అన్నారు. దేశానికి దళిత సామాజికవర్గానికి ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని, అందుకు మాయావతి సరియైన అభ్యర్థి అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పారని, ఈ నేపథ్యంలో కేంద్రంలో మాయావతి ప్రధానమంత్రిగానూ, రాష్ట్రంలో పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలంటే బిఎస్‌పి, సిపిఐ, సిపిఎం బలపర్చిన జనసేన పార్టీ అభ్యర్థులను దళిత, బడుగు, బలహీన వర్గాలు గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments

Comment on this Post
Login to comment